728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 3, 2026

చిలకలూరిపేటలో కుక్కల 'కారు'చీకట్లు: భయం గుప్పిట్లో పురప్రజలు


చిలకలూరిపేట, మార్చి 3: చిలకలూరిపేట పట్టణంలో వీధి కుక్కల బెడద పతాక స్థాయికి చేరింది. పురపాలక సంఘం పరిధిలోని వీధులు, సందుల్లోనే కాకుండా, ప్రధాన కూడళ్లలోనూ కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులను, వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే గుర్రాలచావిడి ప్రాంతంలో సుమారు పదిమందిని కుక్కలు కరవడం పట్టణంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేస్తోంది.

ప్రధాన కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి

గతంలో కుక్కల బెడద వార్డులకే పరిమితం కాగా, ఇప్పుడు పట్టపగలే ప్రధాన రహదారులపై కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.కళామందిర్ సెంటర్, కే.బీ రోడ్డు,శారద హై స్కూల్ రోడ్డు,రాగన్నపాలెం,మద్దినగర్గు, గుర్ర్రాలచౌడి,తదితర ప్రాంతాల్లో వాహనాల వెంట పడటంతో బైక్‌ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. గత రెండు సంవత్సరాల క్రితం సాక్షాత్తూ కౌన్సిలర్లే కుక్కల బారిన పడి ఆసుపత్రి పాలైన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

నిబంధనలు గాలికి.. అధికారుల నిర్లక్ష్యం

వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను స్థానిక అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు నిలదీసినప్పుడు, తాము కూడా భయపడుతూనే తిరుగుతున్నామని అధికారులు సమాధానమివ్వడం వారి అసమర్థతకు అద్దం పడుతోంది.

పన్నుల వసూళ్ల కోసం వాహనాలు పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంటూ ఇళ్ల వెంట తిరిగే సిబ్బందికి, ప్రజల ప్రాణాలు కాపాడాలనే స్పృహ లేదా? అని పుర ప్రజలు నిలదీస్తున్నారు.

ప్రజాప్రతినిధులు స్పందించేది ఎప్పుడు?

పట్టణ ప్రజల సంక్షేమం పట్ల మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, ప్రమాదకరమైన కుక్కలను గుర్తించి షెల్టర్ హోమ్‌లకు తరలించడం వంటి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కుక్కల 'కారు'చీకట్లు: భయం గుప్పిట్లో పురప్రజలు Rating: 5 Reviewed By: NEWS UPDATE