యడ్లపాడు: చారిత్రక ప్రాంతమైన కొండవీడు కోటలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. విడిపోయి ఉండలేమన్న బాధతో ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రేమ విఫలమవడమే కారణం:
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు స్వర్ణభారత్ నగర్‌కు చెందిన రసిక మనికంఠ రాజు (20) అంకమ్మ నగర్‌కు చెందిన ఓ యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో, యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. వివాహం జరిగినప్పటికీ మనస్తాపానికి గురైన సదరు యువతి, భర్తతో ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది.
ఘటన క్రమం:
మనికంఠ రాజు, యువతి కలిసి కొండవీడు కోటకు వెళ్లారు. అక్కడ వారు ‘స్పైకర్’ అనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనికంఠ రాజు 8వ తేదీ సాయంత్రం కన్నుమూయగా, యువతి పరిస్థితి విషమించి 9వ తేదీన తుదిశ్వాస విడిచింది.
కేసు నమోదు:
పర్యాటక ప్రాంతమైన కొండవీడు కోటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుల తల్లులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతదేహానికి గురువారం పోస్టు మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించగా, యువతి మృతదేహానికి శుక్రవారం పోస్టు మార్టం నిర్వహించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

