మృత్యువుకు చిరునామాగా ‘పసుమర్రు’ మలుపు: భయం గుప్పిట్లో వాహనదారులు
చిలకలూరిపేట (రూరల్): అది ఒక ప్రమాదాల నిలయం.. ఆ మలుపు తిరగాలంటేనే వాహనదారుల వెన్నులో వణుకు పుడుతోంది. చిలకలూరిపేట మండలం పసుమర్రు మలుపు వద్ద చీరాల - మార్టూరు వైపు వెళ్లే రహదారి ఇప్పుడు నిత్యం రక్తాన్ని చవిచూస్తోంది. వరుస ప్రమాదాలతో ఈ ప్రాంతం ‘డెత్ స్పాట్’గా మారుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
వరుస ప్రమాదాల పరంపర
గత కొద్దిరోజులుగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి:
ఇటీవల ఒకే రోజు ఉదయం స్కూల్ బస్సు, వ్యాన్ ఢీకొనగా.. అదే రోజు సాయంత్రం కారు ఢీకొని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
రెండు రోజుల క్రితం ఒక తాసిల్దార్ కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సోమవారం నాడు మార్టూరు నుండి కూలీలతో అన్నం పొట్లవారిపాలెం వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాలు నిలిపిన 108 సిబ్బంది. సోమవారం జరిగిన ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అట్లూరి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది శోభన్ బాబు, శివ నాగ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని, డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
పసుమర్రు మలుపు వద్ద రహదారి నిర్మాణం సరిగ్గా లేకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
డిమాండ్:
తక్షణమే ఈ మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉంచాలని, అవసరమైతే రహదారి మలుపును సరిచేసి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాలని స్థానికులు జిల్లా కలెక్టర్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులను కోరుతున్నారు.

