306 జీవో ఉన్నా... ఆచరణ నిల్
చిలకలూరిపేటలో నిలిచిన పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లు...
కొర్రీలు పెడుతున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం
చిలకలూరిపేట:
ప్రభుత్వం ఎంతో ఆశయంతో, పేదల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో బేఖాతరవుతున్నాయి. నిరుపేదలకు మేలు చేసేలా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చిలకలూరిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. పదేళ్లు పూర్తయిన 'బి-ఫారం' (B-Form) పట్టాల రిజిస్ట్రేషన్ల విషయంలో అధికారులు నిబంధనలకు పాతర వేస్తుండటంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీవో ఇస్తే... ఆచరణలో కొర్రీలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ (ల్యాండ్స్-I) శాఖ ద్వారా గత మే నెలలో G.O.Ms.No. 306 ను జారీ చేసింది. దీని ప్రకారం.. కేటాయించిన ఇంటి స్థలాలు లేదా వాటిపై నిర్మించిన ఇళ్లపై ఉన్న బదిలీ నిషేధం, కేటాయింపు తేదీ నుండి పది (10) సంవత్సరాలు పూర్తయిన తర్వాత తొలగించబడుతుంది.
పట్టాదారుడు లేదా వారి వారసులు అసలు పత్రాలు, 10 ఏళ్లు దాటిన హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, ప్లాట్ నంబర్ వివరాలు సమర్పిస్తే.. సెక్షన్ 22-A మినహాయింపునిచ్చి మరీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సదరు ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాకుండా, అదనపు పత్రాలు ఏవీ అడగకూడదని, కాలయాపన చేస్తే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణిస్తామని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. కానీ, చిలకలూరిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
ఆ పర్సంటేజ్ ఇస్తేనే పనులు... లేదంటే తిప్పలే!
చిలకలూరిపేట పట్టణంలో దశాబ్దాల క్రితం 'బి-ఫారం' పట్టాలు పొంది, ఇళ్లు నిర్మించుకుని, పదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకున్న లబ్ధిదారులు వందలాది మంది ఉన్నారు. వీరు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే అధికారుల నుండి తీవ్ర నిరాశే ఎదురవుతోంది.
ప్రభుత్వ జీవోను చూపించి తమకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరినా, అక్కడి సిబ్బంది వివిధ రకాల కొర్రీలు పెడుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. "ఇక్కడ ఈ జీవోలు ఏవీ పనిచేయవు" అంటూ లబ్ధిదారులను రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. తెరవెనుక ఆ పర్సంటేజ్ ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయని, లేదంటే నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యూరమవుతున్నారు.
ఆదాయం 'నిల్'.. భరోసా గాలికి
ఈ జీవో అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చిలకలూరిపేట నుంచి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం పూర్తిగా 'నిల్' (Nil) గా మారిపోయింది.
ప్రభుత్వమిచ్చిన పట్టాకు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా లబ్ధిదారులకు చట్టపరమైన భరోసా లభిస్తుంది.ఆస్తికి సంబంధించిన ఈసీ (EC - Encumbrance Certificate) లో వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
తద్వారా భవిష్యత్తులో వారసులకు, హక్కుదారులకు తమ ఆస్తిపై పూర్తి స్థాయి చట్టపరమైన ధీమా కలుగుతుంది.
కానీ, ఈ ప్రయోజనాలన్నింటినీ తుంగలో తొక్కుతూ స్థానిక సబ్-రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం, వారి స్థలాలపై సర్వహక్కులు కల్పించడానికి తెచ్చిన నూతన విధానాన్ని చిలకలూరిపేటలోని కొందరు అధికారులు నీరుగారుస్తున్నారు. సామాన్యులు, పేదలు తమ చిన్నపాటి అత్యవసర అవసరాల కోసం ఆస్తులను అమ్ముకోవాలన్నా, లేదా బ్యాంకు రుణాలు పొందాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అలాంటి కీలకమైన ప్రక్రియను అధికారులు కావాలనే నిలిపివేసి, అవినీతికి పాల్పడుతుండటంపై స్థానికంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో జారీ చేసిన జీవోకు చిలకలూరిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువ లేకుండా పోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు, బాధితుల డిమాండ్:
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, చిలకలూరిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న ఈ తంతుపై సమగ్ర విచారణ జరపాలి. జీవో 306 ప్రకారం నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుని, పేదల ఆశలను నిలబెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

