చిలకలూరిపేట మున్సిపాలిటీలో గ్రామాల విలీనం రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
చిలకలూరిపేట:చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల విలీనం అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సమీప గ్రామాలైన పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం పంచాయతీలను పురపాలక సంఘంలో కలుపుతూ 2020లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నం.83, జీవో ఎంఎస్ నం.260లను న్యాయస్థానం కొట్టివేసింది
నిబంధనల ఉల్లంఘనపై న్యాయస్థానం ఆగ్రహం
విలీన ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామసభ నిర్వహణకు సంబంధించి కనీసం 48 గంటల ముందు డండోరా లేదా నోటీసు ఇవ్వాలనే ప్రాథమిక నిబంధనను పాటించలేదు. న్యాయస్థానానికి సమర్పించిన గ్రామసభ తీర్మాన పత్రాల్లో తీవ్రమైన తేడాలు, దిద్దుబాట్లు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. సరైన చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా చేపట్టిన ఈ విలీనం చట్టరీత్యా చెల్లదని తేల్చిచెప్పింది.
డీ-మెర్జర్‌కు మార్గం సుగమం
ఈ అంశంపై దాఖలైన రిట్ పిటిషన్ (WP No.19692/2020)ను ఆమోదించిన హైకోర్టు, గ్రామాల విలీనాన్ని రద్దు చేసింది. అదే సమయంలో, ఈ గ్రామాలను మున్సిపాలిటీ నుంచి వేరుచేసి తిరిగి పంచాయతీలుగా కొనసాగించే ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ (WP No.7523/2026)ను న్యాయస్థానం కొట్టివేసింది.
హైకోర్టు వెలువరించిన తాజా తీర్పుతో పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం గ్రామాలు తిరిగి ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా కొనసాగేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ పరిణామంతో ఆయా గ్రామాల డీ-మెర్జర్ ప్రక్రియపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది.

